Home  »  Bollywood News  »  Dhurandhar: రియల్ 'ధురంధర్'.. ఇఫ్తికార్ భట్‌గా మారిన మేజర్ మోహిత్ శర్మ కథ తెలుసా?

Updated : Mar 22, 2026

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న సినిమా 'ధురంధర్ 2'. గతేడాది విడుదలైన మొదటి భాగం ఎంతటి సంచలనం సృష్టించిందో, అంతకు రెట్టింపు సంచలనం పార్ట్-2 సృష్టిస్తోంది. ఇందులో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించాడు. పాకిస్తాన్ కి స్పైగా వెళ్ళి, అక్కడ టెర్రరిస్ట్ లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. 

అయితే రీల్ లైఫ్ లో ధురంధర్ రణ్‌వీర్ సింగ్ అయినప్పటికీ, రియల్ లైఫ్ ధురంధర్ మాత్రం భారత సైన్యంలోని పారా స్పెషల్ ఫోర్సెస్ అధికారి, దివంగత మేజర్ మోహిత్ శర్మ. 'ధురంధర్' సినిమా మోహిత్ శర్మ బయోపిక్ కాదని మూవీ టీమ్ చెప్పినప్పటికీ.. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆయన జీవితానికి దగ్గరగా ఉండటంతో నెటిజన్లు ఈ వీర జవాను సాహసాలను గుర్తు చేసుకుంటున్నారు.

1978 జనవరి 13న హర్యానాలో జన్మించారు మోహిత్ శర్మ. తండ్రి పేరు రాజేంద్ర ప్రసాద్ శర్మ, తల్లి పేరు సుశీల శర్మ. కుటుంబంలో రెండవ సంతానమైన మోహిత్ శర్మకు చిన్నతనం నుంచి ఆర్మీకి వెళ్లాలని ఉండేది. 12వ తరగతి పూర్తి కాగానే, NDA ఎగ్జామ్ రాశారు. డిసెంబర్ 1995లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో చేరారు. 1998లో ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) లో చేరారు. IMAలో ఆయన బెటాలియన్ క్యాడెట్ అడ్జటెంట్‌గా నియమితులయ్యారు. డిగ్రీ పొందాక, మద్రాస్ రెజిమెంట్ యొక్క 5వ బెటాలియన్‌లో చేరారు. డిసెంబర్ 1999లో లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. మోహిత్ శర్మ అత్యంత ప్రమాదకరమైన రహస్య ఆపరేషన్స్ నిర్వహించడంలో దిట్ట.

ఇఫ్తికార్ భట్‌గా మారిన మోహిత్ శర్మ
మేజర్ మోహిత్ శర్మ సాహసాల్లో అత్యంత కీలకమైంది 2004లో జరిగిన ఒక అండర్ కవర్ ఆపరేషన్. కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఆయన తన రూపురేఖలను పూర్తిగా మార్చుకున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో 'ఇఫ్తికార్ భట్' అనే పేరుతో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలోకి చొరబడ్డారు. తన సోదరుడిని భారత సైన్యం చంపిందని, దానికి ప్రతీకారం తీర్చుకోవడానికే తాను వచ్చానని నమ్మించి, శత్రువుల గుండెల్లో నిద్రపోయారు. ఉగ్రవాదుల నమ్మకాన్ని గెలుచుకుని, చివరకు కీలక సమయం చూసి ఇద్దరు అగ్రశ్రేణి ఉగ్రవాదులను హతమార్చారు.

అశోక చక్ర పురస్కారం
మేజర్ మోహిత్ శర్మ 2009, మార్చి 21న కుప్వారా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన తన తోటి సైనికులను రక్షించే క్రమంలో ఆయన ధైర్యంగా పోరాడారు. ఛాతీలో బుల్లెట్లు తగిలినా వెనకడుగు వేయకుండా నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి దేశం కోసం ప్రాణాలర్పించారు. ఆయన చూపిన అసమాన ధైర్యసాహసాలకు గానూ భారత ప్రభుత్వం అత్యున్నత శౌర్య పుస్కారం 'అశోక చక్ర'తో గౌరవించింది. 

'ధురంధర్'కు ప్రేరణ?
మోహిత్ శర్మ వర్ధంతికి రెండు రోజుల ముందే 'ధురంధర్ 2' విడుదల కావడం విశేషం. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమా ఒక ఫిక్షనల్ స్పై థ్రిల్లర్ అని, ఇది మేజర్ మోహిత్ శర్మ బయోపిక్ కాదని స్పష్టం చేసినప్పటికీ.. రణ్‌వీర్ సింగ్ లుక్, కొన్ని మిషన్లు మోహిత్ శర్మను గుర్తుకు తెస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అండర్ కవర్ ఏజెంట్‌గా శత్రువుల మధ్య ఉండటం, దేశం కోసం తన గుర్తింపును మార్చుకోవడం వంటి అంశాలు మోహిత్ శర్మ జీవితానికి దగ్గరగా ఉన్నాయి.

మేజర్ మోహిత్ శర్మ వంటి వీరుల కథలు వెండితెరపైకి రావడం వల్ల యువతలో దేశభక్తి పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి భవిష్యత్తులో మేజర్ మోహిత్ శర్మ పూర్తిస్థాయి బయోపిక్ వస్తుందేమో చూడాలి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.